సీఎం నారా చంద్రబాబు నాయుడు
చెన్నై – ఏపీ రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్ సహకరాంతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని, 1995లో హైదరాబాద్ హైటెక్ సిటీని స్థాపించిన విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ, డీప్ టెక్నాలజీకి కేంద్ర బిందువుగా మార్చుతామని సీఎం చంద్రబాబు అన్నారు. భారతదేశంలో 65 శాతం మంది ఏఐ వినియోగిస్తున్నారని, ఇది ప్రపంచ సగటు 30 శాతం కన్నా అధికమన్నారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త సాంకేతికతలో విద్యార్థులు ముందుండాలని సూచించారు. చెన్నైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మద్రాస్‌లో జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-(AIRSS) 2025కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు.
1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. చైనా ఆర్థిక సంస్కరణలతో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. బ్రిటిష్ పాలకులు మనం దేశం నుంచి వెళ్తూవెళ్తూ ఇంగ్లీష్ భాషను మనకు వదిలేసి పోయారు. ఏపీలోని కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకెళ్లారు. టెలికాం రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు బీఎస్ఎన్ఎల్, వీఎస్ఎన్ఎల్ ఆధిపత్యం ఉండేది. సంస్కరణలు రావడంతో ప్రైవేట్ సంస్థలు కూడా టెలికాం రంగంలోకి వచ్చాయి. ఇదొక గేమ్ ఛేంజర్ అయింది. ప్రస్తుతం ప్రపంచం చూపు భారతదేశం వైపు మళ్లింది. రాబోయే రోజులంతా భారతదేశానివే. ఐఐటీ మద్రాస్ చాలా విషయాల్లో మొదటి స్థానంలో ఉంది. వివిధ రకాల ఆన్లైన్ కోర్సులు కూడా అందిస్తోంది. ఐఐటీ మద్రాస్ కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్ అగ్నికుల్ కోస్మోస్, మైండ్‌గ్రో టెక్నాలజీస్ వంటి స్టార్టప్‌ల్లో నూతన పరిశోధనలు భారతదేశాన్ని అంతరిక్షం, సెమీ కండక్టర్ రంగాల్లో ముందుండేలా చేస్తున్నాయి. ఇక్కడి స్టార్టప్‌లు దాదాపు 80 శాతం సక్సెస్ అయ్యాయి. ఈ ఐఐటీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 40 శాతం దాకా ఉన్నారు.’ అని సీఎం అన్నారు.