రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
స్వామిని కోరుకున్నానన్న సీఎం
తిరుమల – ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలను సందర్శించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు. టీటీడీ ఏఈవో వీర బ్రహ్మం దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. భారీ భద్రత మధ్య క్యూ లైన్ లో స్వామిని దర్శించుకుంది నారా వారి కుటుంబం.
అనంతరం నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. తనను రెండు సార్లు శ్రీ వేంకటేశ్వర స్వామి రక్షించారని గుర్తు చేసుకున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారని కొనియాడారు. వారికి తామంతా రుణపడి ఉన్నామని చెప్పారు.
తాను దేవ దేవుడిని ఒకటే కోరుకున్నానని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా బాగుండాలని , రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించానని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు. ఇక నుంచి తిరుమలలో సామాన్యులకు పెద్ద పీట ఉంటుందన్నారు. గతంలో కొలువు తీరిన జగన్ రెడ్డి సర్కార్ భ్రష్టు పట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పవిత్రమైన ఈ కొండ నుంచే ప్రక్షాళన మొదలు పెడుతున్నామని చెప్పారు. ఇక నుంచి ఎవరైనా సరే ఎలాంటి సమస్యలు ఉన్నా లేదా సలహాలు, సూచనలు ఇచ్చినా తాము స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.