వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం
అమరావతి – సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. మార్కాపురంను జిల్లా చేస్తామని అన్నారు. అంతే కాకుండా వెలుగొండ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఆస్తులు పోయినా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండాను 43 ఏళ్లుగా భుజాన వేసుకుని మోస్తున్నారని కొనియాడారు. కార్యకర్తలు, నేతల కృషి వల్లనే ఇవాళ అధికారంలోకి వచ్చామన్నారు. నేతలు పార్టీ మారినా కార్యకర్తలు పార్టీ కోసం అలాగే ఉన్నారని, వారి నిబద్దత, నిజాయితీని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు సీఎం.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్రమైన ఇబ్బందులు పడ్డారని, లెక్కలేనన్ని కేసులు నమోదు చేసినా చెక్కు చెదరలేదన్నారు.
భయపడకుండా నిలబడి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 57 శాతం ఓట్లతో 93 శాతం స్ట్రైక్ రేట్‌తో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు నారా చంద్రబాబు నాయుడు. పార్టీ విజయం వెనక కార్యకర్తల కష్టం ఉందన్నారు. మార్కాపురం నియోజకర్గం టీడీపీకి ఏకపక్షంగా గెలిచే నియోజకవర్గం కాదు. ఒకసారి గెలుస్తున్నాం…మరోసారి ఓడిపోతున్నాం. అలా కాకుండా ప్రతిసారీ గెలుచుకునేలా చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు సీఎం. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నాకు భగవంతుడు కల్పించాడన్నారు. పోలవరం నుంచి నీళ్లు బనకచర్లకు తీసుకొస్తాం. కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు తీసుకునే అవకాశం ఒక్క వెలుగొండకే ఉందన్నారు. ఇన్ని మంచిపనులు చేసినప్పుడు మార్కాపురంలో శాశ్వతంగా ఎందుకు గెలవకూడదని ప్రశ్నించారు.