పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – వచ్చే నాలుగేళ్లలో ఏపీ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఓవైపు స్వర్ణాంధ్ర-2047 విజన్‌కు అనుగుణంగా పనిచేస్తూనే, మరోవైపు 2029 కల్లా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని స్పష్టం చేశారు. దీనికి బ్యాంకులు సంపూర్ణ మద్దతివ్వాలని సూచించారు. 2025-26లో నిర్దేశించుకున్న క్రెడిట్ ప్లాన్ లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయాలన్నారు. సచివాలయంలో జరిగిన 231వ స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
2024-25 ఆర్ధిక సంవత్సరంలో సాధించిన ఫలితాలపై బ్యాంకింగ్ అధికారులతో చర్చించిన సీఎం 2025-26 లక్ష్యాలను నిర్దేశించారు. నూరు శాతం లక్ష్యాలను అధిగమించి దక్షిణ భారతదేశంలోనే మేటిగా ఉన్నందుకు బ్యాంకర్లను అభినందించారు. సమావేశంలో 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి ‘ఏపీ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్’ను ఆవిష్కరించారు. డ్వాక్రా మహిళలు, కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఎదుగుదలకు ప్రత్యేకంగా ఏం చేయగలం అనేది బ్యాంకర్లు ఆలోచించాలని చెప్పారు.
తరచూ ఎస్‌ఎల్‌బీసీ సమావేశాలు నిర్వహించడానికి ప్రధాన కారణం… రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బ్యాంకుల మద్దతు కూడగట్టేందుకేనని అన్నారు.
డిమాండ్‌కు తగ్గట్టుగా ఏ రంగం పురోగతి సాధించాలన్నా బ్యాంకుల మద్దతు తప్పనిసరి అని చెప్పారు. వివిధ రంగాల్లో భారీగా ప్రాజెక్టులు వస్తున్నాయని, వాటికి అవసరమైన ఆర్ధిక మద్దతు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇంటికో ఎంట్రప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈలు, అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. 2029 కల్లా పేదరికం నిర్మూలించేలా జీరోపావర్టీ-పీ4 అమలు చేసి అసమానతలు తొలిగించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. సంపద సృష్టికి, మౌలిక సదుపాయాల కల్పనకు పీపీపీ విధానాన్ని రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేస్తున్నామన్నారు.
విశాఖ ఆర్ధికాభివృద్ధిలో అనూహ్య పురోగతి సాధిస్తోందని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. అలాగే అమరావతి భవిష్యత్ అవకాశాలకు వేదికగా చేస్తున్నామని, అటు రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అన్నారు.