కూటమి సర్కార్ లక్ష్యం కార్మికుల సంక్షేమం
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – కార్మికుల సంక్షేమం ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. గురువారం సచివాలయంలో కార్మిక శాఖపై సమీక్ష చేపట్టారు. కార్మికుల హక్కులు పరిరక్షించాలని, ఇదే సమయంలో అర్థం లేని నిబంధనలతో పరిశ్రమలపై వేధింపులు ఉండ కూడదని స్పష్టం చేశారు.
భద్రత విషయంలో రాజీ పడకూడదని పేర్కొన్నారు. పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీతో ఆడిట్ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈఎస్ఐ ఆస్పత్రులను బలోపేతం చేస్తామని, రాష్ట్రా వాటా కింద నిధులు విడుదల చేస్తామన్నారు నారా చంద్రబాబు నాయుడు.
2019కి ముందు ఇచ్చిన చంద్రన్న బీమాను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. పరిహారాన్ని కుదించి ఆంక్షలతో లబ్ధిదారులను తగ్గించిందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం.
రూ.10 లక్షల బీమాకు త్వరలో శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసి తర్వాత మళ్లీ సేఫ్టీ గురించి పట్టించు కోవడం లేదన్నారు. ఇలా కాకుండా నిర్థిష్టమైన ప్రణాళికతో భద్రత కోసం పని చేయాలని ఆదేశించారు.
యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటు జరిగితేనే ఉపాధి లభిస్తుందని…అనుమతుల జారీ విషయంలో పారదర్శకంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
పరిశ్రమలు, సిబ్బంది, వాటి భద్రతపై అధికారులు ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో 24,642 వేల ఫ్యాక్టరీలు రిజిస్టర్ అయ్యాయని వాటిలో 11.78 లక్షల మంది పని చేస్తున్నారని వివరించారు.