ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తుతో అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వచ్చే జయంతి నాటికి ఈ విగ్రహ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అమరావతిలోనే మెమోరియల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా పొట్టి శ్రీరాములు స్వగ్రామమైన పడమటిపల్లిలోని నివాసాన్ని మ్యూజియంగా రూపుదిద్దుతామని, గ్రామంలో ఆధునిక వసతులతో ఆరోగ్య కేంద్రం, హైస్కూల్ భవనాన్ని నిర్మిస్తామని అన్నారు. గ్రామస్తుల విన్నపం మేరకు బకింగ్ హామ్ కెనాల్‌పై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఉండవల్లి నివాసంలో ఆదివారం నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలమే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పిలికేలా చేసిందన్నారు. జనం కోసం, తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు బతికారని కొనియాడారు. భూమిపై ఎంతోమంది పుడతారు కానీ కొందరే చరిత్రలో నిలిచి పోతారని అన్నారు. తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గుర్తుంటారని చెప్పారు సీఎం.
ఏ భాష మాట్లాడే వారిని ఆ భాష వారే పాలించుకునే అవకాశం రావాలని పొట్టి శ్రీరాములు కోరుకున్నారు. తెలుగు భాష మాట్లాడేవారికి ప్రత్యేకంగా ఒక రాష్ట్రం కావాలని పోరాడి ఆత్మార్పణ చేశారని అన్నారు. ఆయన పోరాటం చేసే సమయంలో ప్రజలు పెద్దగా ముందుకు రాలేదన్నారు.. ఆ సమయంలో కేంద్రం కూడా దిగిరాలేదు. అయినా 58 రోజుల పాటు కఠోర దీక్షచేసి 1952 డిసెంబర్ 15న ఆత్మబలిదానం చేశారని తెలిపారు.
పొట్టి శ్రీరాములు చని పోయిన తర్వాత ప్రజల్లో ఆగ్రహావేశాలు రేకెత్తాయి. దీంతో ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నామని 1952 డిసెంబర్ 19న పార్లమెంట్‌లో నెహ్రూ ప్రకటించారని గుర్తు చేశారు. తర్వాత తెలంగాణలో కలిసి పోవడం, మళ్లీ 2014లో రెండు రాష్ట్రాలుగా విడిపోడం జరిగి పోయిందన్నారు.