ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్నామన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పురోభివృద్ది వైపు నడిపించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఐదేళ్లూ తమ విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిందని, జరిగిన నష్టాన్ని రాష్ట్రం అధిగమించి అభివృద్ధి చెందేలా, ప్రజలకు
సంక్షేమం అందించేందుకు కలెక్టర్లు కృషి చేయాలని కోరారు. రానున్న రోజుల్లో ప్రజల కోసం, జిల్లా కోసం ఏం చేయాలనే దానిపై యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని సూచించారు. ప్రజలపై మీ ప్రభావం ఎక్కువుగా ఉంటుందని, మీ పనితీరుతో వచ్చే ఫలితాలు వారిపై శాశ్వతంగా చూపిస్తాయని అన్నారు. 26 జిల్లాల కలెక్టర్ల పని తీరును నిరంతరం సమీక్షిస్తున్నామని చెప్పారు.
సంక్షేమం ఫలాలు సక్రమంగా ప్రజలకు అందాలన్నారు సీఎం. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం చివరి స్థాయి వరకు చేరాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను దానం చేసినట్లు కాకుండా గౌరవభావంతో ఇవ్వాలన్నారు. ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రజలే ఫస్ట్ విధానంతో ముందుకు వెళ్లాలన్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు. పగడ్బంధీగా మెగా డీఎస్సీ నిర్వహించాలన్నారు. 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలనే దస్త్రంపైనే మొదటి సంతకం చేశామన్నారు. పాఠశాలలు ప్రారంభించే సమయానికి నియామకాలు పూర్తవ్వాలన్నారు. గతంలో రాష్ట్రంలో ఒకేసారి 1.5 లక్షల టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదన్నారు.