జార్ఖండ్ కు వందనం ప్రజలకు పాదాభివందనం
ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ కీలక కామెంట్స్
జార్ఖండ్ – జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెల్లడి అయ్యాయి. ఇండియా కూటమికి భారీ మెజారిటీని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ , వేయని వారికి కూడా కృతజ్ఞతలంటూ పేర్కొన్నారు.
ఈ సందర్బంగా శనివారం ఎక్స్ వేదికగా అరుదైన ఫోటోలను పంచుకున్నారు హేమంత్ సోరేన్. జార్ఖండ్ మట్టికి అభివందనం చేస్తున్నానని, ప్రజలందరికీ పేరు పేరునా పాదాభివందనం తెలియ చేస్తున్నట్లు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి.
కుట్రలు, కుతంత్రలు , మోసాలు చెల్లుబాటు కావని నిరూపించిన మీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు హేమంత్ సోరేన్. మీరు అందించిన ఈ అపురూపమైన విజయం తనకు మరింత బలాన్ని ఇస్తుందని స్పష్టం చేశారు.
పోరాటానికి, నిలువెత్తు త్యాగానికి ప్రతీక అయిన బిర్సా ముండా సాక్షిగా ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని ప్రకటించారు. ఈ గెలుపు ప్రజలందరిదని పేర్కొన్నారు హేమంత్ సోరేన్.