రాముడు అల్లర్లు చేయమని చెప్పడు
నిప్పులు చెరిగిన సీఎం మమతా బెనర్జీ
పురూలియా – పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. కేంద్రం పై , భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మన ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నం చేస్తుందని, దీనిని తిప్పి కొట్టేందుకు సిద్దంగా ఉండాలని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఎంసీ ఆధ్వర్యంలో పురూలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మమతా బెనర్జీ ప్రసంగించారు. ర్యాలీలు చేపట్టండి..సభలు, సమావేశాలు నిర్వహించండి. కానీ ఎక్కడా సంయమనం కోల్పోవద్దని కోరారు సీఎం.
ఎందుకంటే కులం పేరుతో, మతం పేరుతో మనుషుల మధ్య విభేదాలు సృష్టించి అరాచకాలకు తెర లేపే సంస్కృతి ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని సంచలన ఆరోపణలు చేశారు దీదీ. ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుందని, అంతకు ముందు 17న అల్లర్లు చేసే ఛాన్స్ ఉందన్నారు.
ఇలా అల్లర్లు చెలరేగేలా చేయమని ఏ దేవుడు చెప్పడన్నారు. ప్రత్యేకించి అయోధ్యలో కొలువు తీరిన శ్రీరాముడు చెప్పడని ఎద్దేవా చేశారు సీఎం. ఇకనైనా చిల్లర రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టాలని ఆమె బీజేపీకి సూచించారు.