ఇండియా కూటమికి కంగ్రాట్స్ – స్టాలిన్
జమ్మూ కాశ్మీర్ లో విజయంపై స్పందన
తమిళనాడు – భారతీయ జనతా పార్టీ కుట్రలను , కుతంత్రాలను దాటుకుని జమ్మూ కాశ్మీర్ లో ఇండియా కూటమి ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇండియా కూటమి లో కీలక పాత్ర పోషిస్తున్న ఎంకే స్టాలిన్. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
ఈ సందర్బంగా అద్భుతమైన విజయం సాధించిన జేకేఎన్ సీ , ఐఎన్సీ కూటమితో పాటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలియ చేస్తున్నానని పేర్కొన్నారు ఎంకే స్టాలిన్. ఇది కేవలం ఇండియా కూటమి విజయం మాత్రమే కాదని, ఇది ప్రజాస్వామ్య విజయమని స్పష్టం చేశారు.
ప్రతి చోటా ఇండియా కూటమిని గెలవనీయకుండా చేయాలని బీజేపీ శత విధాలుగా ప్రయత్నం చేసిందని కానీ దాని ఆటలు అక్కడ సాగలేదన్నారు. ఇప్పటికి కూడా హర్యానా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలపై ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. దీనిపై ఈసీ విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ కోరడాన్ని తాను కూడా స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు ఎంకే స్టాలిన్.
బీజేపీ ప్రభుత్వం అన్యాయంగా తొలగించిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్దరించాలనే ఆకాంక్షలకు ఈ గెలుపు ఓ ప్రతిరూపమని పేర్కొన్నారు సీఎం.