ప్రజల చెంతకు డీఎంకే పాలన
అక్కడికక్కడే సమస్యల పరిష్కారం
తమిళనాడు – రాష్ట్రంలో కొలువు తీరిన డీఎంకే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సీఎం ఎంకే స్టాలిన్ దూకుడు పెంచారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నారు. పూర్తిగా పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టారు. ఆయన నేరుగా ప్రజలను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన కోసం ట్రాఫిక్ ను నిలుపుదల చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. అంతే ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఏ పనీ చేయొద్దని సూచించారు. ఇదే సమయంలో ఏ సమస్య ఉన్నా తనకు నేరుగా చెప్పుకునేందుకు వీలు కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే టోల్ ఫ్రీ నెంబర్ కు చేసుకునే ఛాన్స్ ఇచ్చారు.
తాజాగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల దాకా ఎన్నో సమస్యలు పేరుకు పోయాయని గుర్తించారు సీఎం ఎంకే స్టాలిన్. ఈ మేరకు పాలనను ప్రజల వద్దకు తీసుకు వెళ్లేందుకు గాను మంగ తరణ్ మంత్రి అనే పథకానికి శ్రీకారం చుట్టారు. దీనికి భారీ ఎత్తున స్పందన లభించింది.
ఈ స్కీం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వ శాఖల సేవలు ప్రజలకు చేరువ చేయాలనే మహోన్నత లక్ష్యంతో దీనిని రూపొందించారు. గతేడాది డిసెంబర్లో పట్టణ స్థానిక సంస్థల కోసం ప్రారంభించిన ఈ పథకం కింద లక్షలాది మంది అర్జీలను వెంటనే పరిష్కరించారు.
దీనిని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించే క్రమంలో ముఖ్యమంత్రి గురువారం ధర్మపురి జిల్లా పాళయంబుదూర్లోప్రాజెక్ట్ తదుపరి దశను ప్రారంభించారు. దీని ప్రకారం తమిళనాడులోని 12,500 గ్రామీణ పంచాయతీల్లో నిర్వహిస్తున్న 2,500 శిబిరాల ద్వారా ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి వాటిని వెంటనే పరిశీలించి తగిన పరిష్కారాలను కనుగొంటారు.