టీవీకే పార్టీపై స్టాలిన్ సెటైర్ విజయ్ పై ఫైర్
దాని గురించి ఆందోళన లేదన్న సీఎం
తమిళనాడు – డీఎంకే చీఫ్, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ గురించి సీరియస్ కామెంట్స్ చేసిన టీవీకే పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు తళపతి విజయ్ పై నిప్పులు చెరిగారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
కొత్తగా పార్టీ పెట్టిన అధినేత తమ గురించి అవాకులు చెవాకులు పేలారని, ఆయనకు అంత సీన్ లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటనేది ప్రజలు తేలుస్తారని అన్నారు. తాము ప్రజల కోసం పని చేస్తున్నామే తప్పా దోచు కోవడం లేదన్నారు ఎంకే స్టాలిన్.
రాజకీయ పరంగా అనుభవం లేక పోవడం వల్లనే అలాంటి కామెంట్స్ చేశారని, అయినా టీవీకే గురించి, తళపతి విజయ్ గురించి మాట్లాడాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమ లెక్కల్లోనే ఆ పార్టీ లేదన్నారు. ప్రతి సభకు జనం వస్తారని, ఇది భారత దేశంలో షరా మామూలేనని స్పష్టం చేశారు.
సభకు వచ్చిన ప్రతి ఒక్కరు ఓటు వేస్తారని అనుకోవడం భ్రమ అన్నారు. అయితే పార్టీ పెట్టడం వారి హక్కు అని, దానిని ఎవరూ కాదనలేరని అన్నారు. మొత్తంగా టీవీకే ను తాను పార్టీగా గుర్తించడం లేదన్నారు. దాని వల్ల తమ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు ఎంకే స్టాలిన్. తమపై ఆరోపణలు చేసే ముందు తాను ఏమిటో ఆలోచించుకుని మాట్లాడి ఉంటే బావుండేదన్నారు సీఎం.