అమ్మ క్యాంటీన్లకు మరిన్ని నిధులు
ప్రకటించిన సీఎం ఎంకే స్టాలిన్
తమిళనాడు – రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆకస్మికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అమ్మ క్యాంటీన్ల పరిస్థితి గురించి ఆరా తీశారు. శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ నిర్వాహకులు ఎలా నిర్వహిస్తున్నారనే దానిని పరిశీలించారు.
రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం హయాంలో పేదలు, సామాన్యుల ఆకలిని తీర్చేందుకు దివంగత సీఎం జయలలిత సంస్మరణ నిమిత్తం అమ్మ పేరుతో క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం కూలి పోయింది. దాని స్థానంలో డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పడింది.
తీరా ఈ ప్రభుత్వం వచ్చాక అమ్మ క్యాంటీన్లను రద్దు చేస్తారని, వాటి స్థానంలో వేరే వాటిని తీసుకు వస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో సీఎం ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అమ్మ జయలలిత పేరు మీదనే తాము క్యాంటీన్లను నిర్వహిస్తామని ప్రకటించారు. తన నిర్ణయం మారదని తెలిపారు. తమపై నోరు పారేసుకున్న వారికి కోలుకోలేని షాక్ ఇచ్చారు సీఎం. ఎలాంటి దురుద్దేశాలకు ఆస్కారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లలో 450 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందన్నారు ఎంకే స్టాలిన్. రోజుకు లక్ష మందికి పైగా ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేస్తోందన్నారు.
ఇవాళ తేనంపేటై ప్రాంతంలోని అమ్మ రెస్టారెంట్‌లలో ఒకదానిలో ఆకస్మిక సర్వే చేపట్టారు. ఆహార నాణ్యత గురించి ప్రజలను అడిగారు. అక్కడి సిబ్బందిని కూడా వారి అవసరాల గురించి ఆరా తీశారు. చెన్నైలోని అమ్మ రెస్టారెంట్ల కోసం రూ. 7 కోట్ల విలువైన కొత్త పాత్రలు, వంట సామగ్రిని కొనుగోలు చేసేందుకు , అమ్మ రెస్టారెంట్ల పునరుద్ధరణకు రూ. 14 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం.