ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి: రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ డిజిటల్ అక్షరాస్యుడిగా మారాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చి దిద్దాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని స్పష్టం చేశారు. పీపుల్స్ పర్సెప్షన్, ఆర్టీజీఎస్ పైన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ప్రగతి గురించి ఆరా తీశారు. ప్రజలందరూ వాట్సాప్ గవర్నెన్స్ సులభంగా ఉపయోగించుకునేలా చూడాలన్నారు. ప్రభుత్వం నుంచి ఏ సేవ కావాలన్నా అధికారులు, కార్యలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేశామన్నారు.
కేవలం తమ ఫోనులో వాట్సాప్ ద్వారా తమకు కావాల్సిన సేవలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కల్పిస్తోందన్నారు. దీనిపై ప్రజల్లో ఇంకా కొంత అవగాహన తక్కువగా ఉందని, ప్రజలందరూ సమర్థవంతంగా వాట్సాప్ గవర్నెన్స్‌ను విరివిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్లందరూ ఈ బాధ్యత తీసుకుని తమ జిల్లాలో ప్రజల్లో వాట్సాప్ గవర్నెన్స్‌ను పెద్ద ఎత్తున ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాలు, సచివాలయ సిబ్బంది ద్వారా ఆయా ప్రాంతాల్లో దీని గురించి ప్రజల్లో అవగాహన పెంచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.