త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – త్వరలో జరగనున్న రాష్ట్ర శాసన సభ సమావేశాల సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పూర్తి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.
శనివారం సచివాలయంలో నూతనంగా సివిల్స్ అభ్యర్థుల కోసం భరోసా కల్పించేందుకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా జాబ్ నోటిఫికేషన్స్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
తమ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో కట్టుబడి ఉందన్నారు ఎనుముల రేవంత్ రెడ్డి. ప్రతి ఏటా మార్చి 31 లోగా అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను తెప్పించుకుంటామని చెప్పారు. జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోపు నియామక పత్రాలను ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో పెట్టాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు సీఎం.
నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తుందని ముందు ప్రభుత్వంపై విశ్వాసం, నమ్మకం ఉండాలన్నారు. ఈ ప్రభుత్వం కచ్చితంగా, సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించి సమర్థులైన వారిని ఎంపిక చేస్తుందన్న నమ్మకం రావాలన్నారు.
ఎంపికలోనూ కచ్చితంగా సామాజిక న్యాయం పాటిస్తుందని చెప్పారు సీఎం. ఎస్సీ, ఎస్టీ ఓబీసీ, మహిళా రిజర్వేషన్లు పాటిస్తుందని తెలిపారు. ఎలాంటి అపనమ్మకాలు అవసరం లేదన్న భావన రావాలని పేర్కొన్నారు.
కష్టపడే విద్యార్థులకు ఈ ప్రభుత్వం భుజం తడుతుందని భరోసానిచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే చిత్తశుద్ధితో 30 వేల ఖాళీలను భర్తీ చేసి నియామక పత్రాలను అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు.