త్వరలోనే విద్యా..వ్యవసాయ కమిషన్
పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు సీఎం.
విద్య, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం గతంలో ప్రతిపాదించినట్టుగా త్వరలోనే విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావుతో కలిసి సచివాలయంలో విద్యావేత్తలు హరగోపాల్, కోదండరాం, శాంతా సిన్హా, అల్దాస్ జానప్య, పద్మాజా షా, లక్ష్మీ నారాయణ, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యా రంగంలోని పలు సమస్యలు, అంశాలను వారు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. విద్యా రంగం బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న పలు విషయాలను రేవంత్ రెడ్డి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించామని, అంగన్ వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
11 వేలకుపై గా ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేశామని, ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహణ, పాఠశాలలు తెరిచిన రోజే పిల్లలందరికీ యూనిఫాంలు, పాఠ్య పుస్తకాల అంద చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెడతామన్నారు. విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన మార్పులపై విధాన పత్రం రూపొందించి వాటిపై సబ్ కమిటీతోనూ చర్చించాలని వారికి సూచించారు.