స్పష్టం చేసిన సీఎం రేవంత్
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతులు తీసుకున్న రుణాలకు సంబంధించి మరోసారి మాట మార్చారు. గతంలో పలుమార్లు తేదీలు చెబుతూనే వెళ్లారు. ఎన్నికల సమయంలో దీనినే ప్రధాన అస్త్రంగా ముందుకు తీసుకు వెళ్లారు. ప్రతిపక్షాలు సీఎంను తప్పు పడుతూ వచ్చాయి. అయినా వినిపించు కోలేదు రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉండగా మంగళవారం సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. తమ పార్టీ చేసిన ప్రకటన మేరకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఆగస్టు 15 లోగా రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
రూ. 2 లక్షల వరకు తీసుకున్న రుణాలకు చెందిన రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు రైతుల జాబితాను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. నిధుల సమీకరణపై కూడా రోడ్ మ్యాప్ సిద్దం చేయాలన్నారు. లబ్దిదారుల ఎంపికలో సమస్యలు ఉండ కూడదని స్పష్టం చేశారు.