అర్ధరాత్రి దాకా హోటళ్లకు పచ్చ జెండా
పర్మిషన్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శాసన సభ సాక్షిగా కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. అర్ధరాత్రి ఒంటి గంట వరకు హొటళ్లు , ఇతర వ్యాపార, వాణిజ్య దుకాణాలు తెరిచి ఉంచుకోవచ్చని ప్రకటించారు. ఇప్పటి వరకు వాటిపై నిషేధం అనేది ఉండేదని కానీ తాము అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు సీఎం.
అయితే మద్యం షాపులకు, బార్లు, పబ్ లకు మాత్రం అనుమతి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. చాలా మంది నైట్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తారని, ఇదే సమయంలో దుకాణాలు , మాల్స్ , మార్కెట్ లు , హోటళ్లు రాత్రి 10 లేదా 11 గంటల వరకే మూసి వేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ కు భారీ ఎత్తున పర్యాటకులు వస్తుంటారని, ఇతర ప్రయాణీకులు కూడా సందర్శిస్తారని వారిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు ఎనుముల రేవంత్ రెడ్డి.
ప్రధానంగా తెలంగాణ , హైదరాబాద్ సంస్కృతిలో అర్ధరాత్రి వరకు ఇరానీ ఛాయ్ తాగడం, దమ్ బిర్యానీ తినడం అలవాటు అని, ఈ మేరకు ఛాయ్ , బిర్యానీ , చార్మినార్ బిస్కట్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని వారికి ఖుష్ కబర్ చెబుతున్నట్లు ప్రకటించారు సీఎం. ఈ మేరకు కమిషనరేట్లకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు.