NEWSTELANGANA

ఉస్మానియా హాస్పిట‌ల్ కు కొత్త భ‌వ‌నం

Share it with your family & friends

నిర్మించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

హైద‌రాబాద్ – ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హైదరాబాద్​లోని గోషామహల్‌లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ఆదేశించారు. గోషా మహల్‌ పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ కలిపి దాదాపు 32 ఎకరాల స్థలాన్ని వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని స్ప‌ష్టం చేశారు సీఎం.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్పీడ్‌ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫీషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

స్పీడ్ జాబితాలో ఉన్న 19 పనుల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారా మెడికల్ కాలేజీలు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణాలపై చర్చించారు.

రాబోయే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆసుపత్రి నిర్మాణానికి అనుభజ్ఞులైన ఆర్కిటెక్టులతో డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునే కనెక్టింగ్ రోడ్లను అభివృద్ధి చేయాలని, ఆసుపత్రి చుట్టూ నలు దిశలా రోడ్డు ఉండేలా డిజైన్ చేయాలని చెప్పారు.

ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించేలా ప్రణాళికలు ఉండాలని చెప్పారు. కార్పొరేట్ తరహాలో వైద్య విభాగాలు, సేవలన్నీ అక్కడే అందుబాటులో ఉండాలన్నారు.

గోషామహల్ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించినందుకు పోలీసు విభాగానికి ప్రత్నామ్నాయ స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.