త్వరలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం
ప్రకటించిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రానుంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. శుక్రవారం శాసన సభలో ప్రసంగించారు సీఎం. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే హైదరాబాద్ లో పలు స్టేడియాలు ఉన్నాయని, కొన్ని ఉపయోగంలో ఉండగా మరికొన్ని ఇతర కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని వాటిపై ఫోకస్ పెట్టామని చెప్పారు ఎనుముల రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో రాష్ట్రం తరపున దేశానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చేలా చేసిన ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్, ప్రముఖ స్టార్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ లకు గ్రూప్ -1 పోస్టులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
ఇందులో భాగంగా ముచ్చర్లకు సమీపంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్టేడియం నిర్మాణం చేపట్టాలని తాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తో మాట్లాడానని, వారు కూడా ఓకే చెప్పారని తెలిపారు. త్వరలోనే ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మాణానికి పునాది వేస్తామన్నారు.