సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్రకటన
హైదరాబాద్ – కవులు, కళాకారులు, రచయితలకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపమే తెలంగాణ తల్లి విగ్రహం అని అన్నారు. డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోతుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి పాలకులు తెలంగాణ తల్లి రూపం ఇలా ఉండాలని గానీ, ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా చేయాలని గానీ ఏ రోజూ ఆలోచన చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీజీ అని మార్చామన్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు స్ఫూర్తినిచ్చి నిలబడ్డ అందేశ్రీ గేయం రాష్ట్ర గీతంగా మార్చుకుంటామని ఉమ్మడి రాష్ట్రంలో, సమైక్య పాలనలో ఎన్నోసార్లు చెప్పుకున్నా, రాష్ట్రం ఏర్పడ్డాక అది జరగలేదని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గేయాన్ని అధికారిక గేయంగా ప్రకటించుకున్నామని తెలిపారు.
గూడ అంజయ్య, ప్రజా కవి గద్దర్, బండి యాదగిరి, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, పైడి జయరాజ్ , పాశం యాదగిరి , ఎక్కా యాదగిరి లాంటి ఎందరో తెలంగాణ ప్రముఖులను లేదా వారి కుటుంబాలను సన్మానించాలని నిర్ణయించామని ప్రకటించారు. వారికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల చొప్పున స్థలంతో పాటు కోటి రూపాయల నగదు, తామ్ర పత్రం బహుమతిగా అందజేస్తామని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి.