కేసీఆర్ చేసిన అప్పులు రూ. 7 లక్షల కోట్లు
నెలకు రూ. 6,500 కోట్ల అసలు..వడ్డీ కడుతున్నాం
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మాజీ సీఎం కేసీఆర్ పై రెచ్చి పోయారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పులతో రాష్ట్రాన్ని కేసీఆర్ తమకు అప్పగించారని ఆరోపించారు. 10 ఏళ్ల కాలంలో ఏకంగా రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేశారని, వాటికి నెల నెలా అసలు, వడ్డీలు కట్టలేక పోతున్నామని వాపోయారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో రూ. 16,000 కోట్లు మిగులు బడ్జెట్ తో ఉండేదన్నారు. కానీ మనోడు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆనాటి నుంచి నేటి దాకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఇక్కడ ఏ బిందె లేదన్నారు సీఎం.
తాము వచ్చాక స్ట్రీమ్ లైన్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ. 2 లక్షల రుణాలు మాఫీ చేయడం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. నిధులు లేక పోయినా సరే తమ ప్రభుత్వం రైతు భరోసా కొనసాగించి తీరుతుందన్నారు.
సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు సీఎం. భట్టి ఆధ్వర్యంలో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేశామన్నారు.