తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం
హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. ఈనెల 14న రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ రైతు భరోసా కింద వారి ఖాతాల్లో డబ్బులను జమ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు సీఎం ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. విధి విధానాలను రూపొందించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. తాము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు సీఎం.
ఇదిలా ఉండగా గత ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను ప్రకటించింది. ఇందులో భాగంగా రైతులకు భరోసా కల్పిస్తామని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపింది. ఇచ్చిన హామీ మేరకు అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని, అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఇదే సమయంలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరాక వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని స్పష్టం చేశారు . సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని ఇప్పటికే ప్రకటించామని దానిని అమలు చేసి తీరుతామన్నారు.