NEWSTELANGANA

త్వ‌ర‌లో 15 వేల పోలీస్ ఉద్యోగాల భ‌ర్తీ

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి వెల్ల‌డి

హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పారు. రానున్న 15 రోజుల్లో 15 వేల పోలీసుల ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంతే కాకుండా ప్ర‌స్తుతం ఉన్న గ్రూప్ -1 పోస్టుల‌కు అద‌నంగా 60 పోస్టులు మంజూరు చేశామ‌ని తెలిపారు.

రాష్టంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.
పదేండ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురై వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన నిరుద్యోగుల్లో విశ్వాసం నింపేందుకు చ‌ర్య‌లు చేపడుతుందన్నారు.

గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సింగరేణి సంస్థను అన్ని రకాలుగా ఆదుకుంటామని భ‌రోసా ఇచ్చారు. సింగరేణిలో 441 మందికి హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.

వీరిలో బ‌దిలీ వ‌ర్క‌ర్లు, జూనియ‌ర్ అసిస్టెంట్లు, మోటారు మెకానిక్‌లు ఉన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా, అంబేద్కర్ విగ్రహ సాక్షిగా నియామకాల పత్రాలను అందజేస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్రను ఎవరూ తగ్గించలేరని ఆయన స్పష్టం చేశారు. పార్టీలు తెలంగాణ సాదనలో వైఫల్యం చెందినా కార్మికులు రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.

సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఇటివలే తాను ఆదేశించినట్లుగా సీఎం స్పష్టం చేశారు. సింగరేణి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.