జమ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి
నారాయణపేట జిల్లా – ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. నారాయణపేట జిల్లా కోస్గిలో ఆదివారం నాలుగు పథకాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అర్ధరాత్రి దాటాక రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామని వెల్లడించారు. తాము మాట ఇచ్చామంటే తప్పమన్నారు.
గత ప్రభుత్వం గాలి కబుర్లు చెప్పిందని, తెలంగాణ పేరుతో విధ్వంసానికి పాల్పడిందన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతుందన్నారు సీఎం. తమది రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ధాన్యం భారీ ఎత్తున పండించారని, పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఎకరాకు రూ. 500 చొప్పున రైతుల ఖాతాల్లో వేశామని వెల్లడించారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.
దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు ఎ. రేవంత్ రెడ్డి.