ఓటు వజ్రాయుధం – సీఎం
ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు
కొడంగల్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటు ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సామాన్యుడిని అసమాన్యుడిగా చేసే అద్భుతమైన మార్గం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఒక్క ప్రజాస్మామ్యమేనని స్పష్టం చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి శాసన మండలి స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. తమ పార్టీ తరపున ప్రముఖ పారిశ్రామిక వేత్త , ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుడి కుమారుడు, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడు మన్నె జీవన్ రెడ్డికి తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. అభివృద్ది ఫలాలు అందాలన్నా, మార్పు జరగాలంటే ముందుగా విలువైన ఓటు హక్కు వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు. పని చేసే వారు ఎవరో గుర్తించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎనుముల రేవంత్ రెడ్డి.
అహంకారానికి, రాచరికానికి చెక్ పెట్టేది కేవలం ఓటు మాత్రమేనని, ఇది తాజాగా రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో రూఢీ అయ్యిందన్నారు. దొర పాలనకు తెర పడిందని, ప్రజా పాలన ప్రారంభమైందన్నారు. ఇదంతా కేవలం ఓటు ద్వారా మాత్రమే సాధ్యపడిందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేశారు.