NEWSTELANGANA

పీఎం మోదీ టూర్ లో సీఎం

Share it with your family & friends

పాల్గొనున్న ఎనుముల రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా – భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ సోమ‌వారం తెలంగాణ రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న రాకతో పెద్ద ఎత్తున భద్ర‌తా ఏర్పాట్ల‌ను చేశారు. ఇదిలా ఉండ‌గా గ‌తంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మోదీ రాక‌ను ప‌ట్టించు కోలేదు. పీఎం వ‌చ్చినా చూసీ చూడ‌న‌ట్లు ఉన్నారు. ఆపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.

కానీ దానికి భిన్నంగా రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంది. కేంద్రంతో స‌ఖ్య‌త‌తో ఉంటూనే త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నం చేస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ మేర‌కు ఆయ‌న కొలువు తీరిన వెంట‌నే ఢిల్లీకి వెళ్లారు.

మర్యాద పూర్వ‌కంగా ప్ర‌ధాని మోదీని, కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, రాజ్ నాథ్ సింగ్ , నిర్మ‌లా సీతా రామ‌న్ , త‌దిత‌రుల‌ను క‌లుసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధుల‌ను మంజూరు చేయాల‌ని కోరారు. ఈ మేర‌కు పీఎం , కేంద్రం సానుకూలంగా స్పందించారు.

ఇక పీఎం టూర్ లో భాగంగా మోదీ ఆదిలాబాద్ జిల్లాకు రానున్నారు. ఆయ‌న టూర్ లో తాను త‌ప్ప‌క పాల్గొంటాన‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి. సోమ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు బేగంపేట నుండి హెలికాప్ట‌ర్ లో ఆదిలాబాద్ కు చేరుకుంటారు సీఎం.

10.30 గంట‌ల‌కు ఆదిలాబాద్ ఏరో డ్ర‌మ్ కు చేరుకుంటారు. అక్క‌డ ప్ర‌ధాన మంత్రి మోదీకి సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతారు సీఎంతో పాటు మంత్రి దాస‌రి సీత‌క్క‌.