కల్వకుర్తికి రూ. 309 కోట్ల నజరానా
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా – ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తన స్వంత గడ్డ కల్వకుర్తి శాసన సభ నియోజకవర్గానికి భారీ వరాలు ప్రకటించారు. కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన సంచలన ప్రకటన చేశారు.
కేవలం ఈ ఒక్క నియోజకవర్గం అభివృద్ది కోసం ఏకంగా రూ. 309 కోట్లు ప్రకటించారు. తాను చదువుకున్న తాండ్ర పాఠశాల కోసం రూ. 50 లక్షలు అడిగిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారు. రూ. 5 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ నుంచి కల్వకుర్తికి నిత్యం రద్దీగా ఉండడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఉండేందుకు నాలుగు లేన్ల రోడ్డును మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కల్వకుర్తిలో 50 పడకల మెటర్నిటి అండ్ చైల్డ్ (MCH) ఆసుపత్రికి రూ.22 కోట్లు, ఆమనగల్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు రూ.10 కోట్లు. నాలుగు ఆర్ అండ్ బి రహదారుల నిర్మాణానికి రూ. 163 కోట్లు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు సీఎం.
ఇక కల్వకుర్తిలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ. 5 కోట్లు, పంచాయతీ రోడ్లకు రూ. 78 కోట్లు, అయిదు హై లెవల్ వంతెనల నిర్మాణానికి రూ. 15 కోట్లు , సూదిని జైపాల్ రెడ్డికి చెందిన మాడ్గుల మండంలోని ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 8.3 కోట్లు, భూగర్భ డ్రైనేజీ పనులకు రూ. 7.75 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.