16న సీఎం కలెక్టర్లు..ఎస్పీలతో మీటింగ్
ప్రజా పాలన ఎజెండాపై ఫుల్ ఫోకస్
హైదరాబాద్ – రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ ప్రజా పాలనపై ఫోకస్ పెట్టింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్ రెడ్డి ఆయా శాఖలపై ఇప్పటికే సమీక్షలు చేపట్టారు. దశల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని జిల్లాల వారీగా పాలనా పరంగా మరింత పట్టు పెంచుకునేందుకు గాను నివేదికలు ఇవ్వాలని స్పష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు.
తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి. ఈనెల 16వ తేదీన హైదరాబాద్ లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో ఆయా జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. కాగా ప్రజా పాలనే ఎజెండాగా సమావేశం జరుగుతుందని, మొత్తం ఇందులో భాగంగా 9 అంశాలను చర్చించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.