సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
హైదరాబాద్ – ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగా ఖాన్ మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సామాజిక వేత్తగా, మానవతావాదిగా పేరు పొందారని, ఆగాఖాన్ నెట్ వర్క్ ద్వారా వివిధ దేశాల్లో ఆస్పత్రులు, విద్యా, సాంస్కృతిక సంస్థలను నెలకొల్పి మానవాళికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. వేలాది మంది విద్యార్థులకు విద్యా దానం చేశారని, ఉన్నతమైన చదువులు చదివేందుకు దోహద పడ్డారని పేర్కొన్నారు. ఆయన మృతి యావత్ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
పదరిక నిర్ములన, వారసత్వ సంపద పరిరక్షణకు, వైద్య సేవలు, విద్యా రంగంలో ఆయన అందించిన సేవలు మరిచి పోలేనివన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఆగా ఖాన్ సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంతో గొప్పవని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆయన జీవితాంతం మానవ జాతి గౌరవం పెంచే ఉన్నత విలువలను ఆచరించారని కొనియాడారు. వారి వారసులకు, కుటుంబ సభ్యులకు, అనుచరులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
20 సంవత్సరాల వయసులో హార్వర్డ్ అండర్ గ్రాడ్యుయేట్‌గా ప్రపంచంలోని మిలియన్ల మంది ఇస్మాయిలీ ముస్లింలకు ఆధ్యాత్మిక నాయకుడిగా మారి, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇళ్ళు, ఆసుపత్రులు, పాఠశాలలను నిర్మించడానికి బిలియన్ల డాలర్లను ఖర్చు చేశారు ఆగా ఖాన్. ఆయన వయసు 88 ఏళ్లు.