ప్లేయర్ శ్రీజకు సీఎం కంగ్రాట్స్
ప్రభుత్వ సహకారం అందిస్తాం
హైదరాబాద్ – తెలంగాణకు చెందిన ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ సెన్సేషన్ గా నిలిచింది. 2024 పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. ఈ విషయం తెలిసిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ఆకుల శ్రీజను అభినందనలు తెలిపారు.
హైదరాబాద్ నగరానికి చెందిన ఆకుల శ్రీజ తన కెరీర్‌లో మొదటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని రాణించారని అభినందించారు. ఎన్నో టైటిళ్లతో పాటు రెండుసార్లు జాతీయ చాంపియన్‌షిప్ సొంత చేసుకుని ఎంతో మంది క్రీడాకారులకు స్పూర్తిగా నిలిచిందని కొనియాడారు.
ఆకుల శ్రీజ త్వరలో జరగబోయే ఒలిపింక్స్‌లో రాణించాలని, కెరీర్‌లో మరెన్నో విజయాలు సాధించాలని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా తమ ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు.
క్రీడాకారులకు మరిన్ని సౌకర్యాలు అందజేస్తామని, ఇందులో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. దేశంలో, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు రాణించాలని కోరారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా తనను నేరుగా కలిస్తే పరిశీలించి సాయం చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.