ఏఐసీసీ పెద్దలతో ములాఖత్
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీకి వెళ్లడం ఇది 39వ సారి కావడం గమనార్హం. ఆయనతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ములాఖత్ అవుతారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళతారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేల కోటా కింద నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
మరో వైపు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీన్ మారింది కాంగ్రెస్ పార్టీలో. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని, పార్టీ లేకపోతే మనుగడ ఉండదని కుండ బద్దలు కొట్టారు మీనాక్షి నటరాజన్. అంతే కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఛాన్స్ ఉండదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉంది. మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన వారికే పదవులు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఆశావహుల సంఖ్య మరింత పెరిగింది. మీనాక్షి నటరాజన్ వచ్చాక వరుస సమీక్షలతో హోరెత్తిస్తున్నారు.