తక్షణమే రావాలని పార్టీ ఆదేశం
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఢిల్లీకి రావాలంటూ పార్టీ హై కమాండ్ ఆదేశించింది. కాంగ్రెస్ శాసన సభ పక్ష ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. సమావేశం అయిన వెంటనే సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రావాలని స్పష్టం చేసింది. సాయంత్రం పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ కూడా హాజరు కానున్నారు. కాగా సీఎం ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ నెలకొంది. తనను మార్చుతారనే ప్రచారం జోరందుకుంది.
రాష్ట్రంలో గత కొంత కాలంగా చోటు చేసుకున్న పరిణామాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో 11 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. వీరి సమావేశం పార్టీలో కలకలం రేపింది. దీనిపై ఆరా తీసింది పార్టీ హైకమాండ్.
మరో వైపు కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ప్రత్యేకించి రెడ్డి సామాజిక వర్గాన్ని కించ పర్చేలా కామెంట్స్ చేస్తుండడం పార్టీని ఇబ్బంది పెట్టేలా ఉంది. తాజాగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై బీసీలు, ఎస్టీలకు చెందిన మాదిగలు భగ్గుమంటున్నారు.