లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడొద్దు
స్పష్టం చేసిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా సరే ఎంతటి స్థాయిలో ఉన్నా సరే లా ఆర్డర్ అత్యంత ముఖ్యమన్నారు. ఎవరినీ ఉపేక్షించొద్దని హెచ్చరించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది బాధితుల తోనే కానీ నేరస్తులతో కాదనే విషయం గుర్తుంచు కోవాలని అన్నారు ఎనుముల రేవంత్ రెడ్డి. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కు పాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. ప్రధానంగా డ్రగ్స్ విషయంలో ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని, ఎప్పటికప్పుడు దాడులు, సోదాలు చేపట్టాలని సూచించారు.
కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి దిశా నిర్ధేశం చేశారు. పోలీసులు రహదారులపై కనిపించాలని, పీరియాడికల్ క్రైమ్ రివ్యూలు చేయాలన్నారు.
కమిషనర్లు, ఎస్పీలు మొదలు ఎస్ హెచ్ వోల వరకు క్షేత్ర స్థాయి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. గతేడాది కన్నా నేరాలు తగ్గాయని పోలీసు అధికారులు వివరించగా, వాటిని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
కల్తీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. కొన్నిసార్లు కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తారని, అటువంటివి జరగకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు.
అటవీ భూముల్లో పండ్ల మొక్కలు నాటడాన్ని ప్రోత్సహించి తద్వారా గిరిజనులకు ఆదాయం పెంచాలని సీఎం సూచించారు.