అమిత్ షాతో సీఎం భేటీ
నిధులు మంజూరు చేయండి
న్యూఢిల్లీ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాల గురించి ప్రస్తావించారు. వినతి పత్రాన్ని అందజేశారు.
తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TSNAB), తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCSB) ఆధునీకరణకు నిధులు మంజూరు చేయాలని కోరారు సీఎం. 2021 నుండి పెండింగ్ లో ఉన్న ఐపీఎస్ కేడర్ ను బలోపేతం చేసే అంశం గురించి తక్షణమే సమీక్షించాలని సూచించారు.
వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల జాబితా నుంచి గతంలో తొలగించిన ఆదిలాబాద్, మంచిర్యాల, కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలను SRE (reimbursement of Security Related Expenditure ) పథకం కింద తిరిగి కొనసాగించాలని కోరారు.
వామపక్ష తీవ్రవాదుల కార్యకలాపాలను అరికట్టేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామంలో, ములుగు జిల్లా (వి), వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామంలో రెండు సిఆర్పిఎఫ్ జెటిఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు.
నాలుగేళ్లుగా ఎస్పీవో (స్పెషల్ పోలీస్ ఆఫీసర్)లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 60 శాతం వాటా నిధులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు.