2న ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభ
హాజరు కానున్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ , తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు పోటా పోటీగా తమ అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. కొత్తగా రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి.
ఇందులో అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ కు ఉండగా మిగతా స్థానాలలో బీజేపీ, కాంగ్రెస్ కు ఉన్నాయి. ఈ మధ్యనే ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. వారిలో సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. వచ్చే నెల ఫిబ్రవరి 2 నుంచి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో పార్టీ ఎన్నికల ప్రచారం చేపట్టనుంది. ఏఐసీసీ సీనియర్ నాయకులు కూడా ఇందులో పాల్గొననున్నారు.
రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకుంది టీపీసీసీ. ఇదిలా ఉండగా పోరాటాలకు , త్యాగానికి మారు పేరైన ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి సభ ఉండనుందని పార్టీ ప్రకటించింది.