దక్షిణ భారతంపై కేంద్రం వివక్ష
నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఉత్తర భారతం , దక్షిణ భారత దేశం పట్ల పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుండడం పట్ల మండిపడ్డారు సీఎం.
దేశంలో కుంభ మేళా నిర్వహిస్తే రూ. 100 కోట్లు మోదీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద అడవి బిడ్డల జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కేవలం రూ. 3 కోట్లు మాత్రమే మంజూరు చేయడం దారుణమన్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి, వివక్షకు నిదర్శనం కాదా అని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి.
కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు అయోధ్య లోని రామ మందిరాన్ని సందర్శిస్తున్నారని మరి ఇదే సమయంలో మేడారం జాతరకు ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా రావచ్చని , ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు .
మేడారం జాతరకు జాతీయ పండుగ హోదాపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో ఆంధ్రా పాలకుల కంటే కేసీఆర్ ఎక్కువ నష్టం చేశారని ఆరోపించారు.