ప్రాజెక్టులపై సీఎం ప్రత్యేక దృష్టి
త్వరిత గతిన పూర్తయ్యేలా చర్యలు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వర్షాలు ఇంకా ఆశించిన మేర రాలేదు. రాబోయే రోజుల్లో తాగు, సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం లేక పోలేదు. అడపా దడపా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆశించిన మేర కురియక పోవడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. కోట్లాది మంది ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువులు, కుంటలపై ఆధారపడి బతుకుతున్నారు.
ఇందులో భాగంగా ఎగువ నుంచి వచ్చే నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత 6 ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తక్కువ ఖర్చుతో ఆయకట్టుకు నీరు అందించేలా కార్యాచరణ రూపొందించాలని సంబంధిత నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. అంతే కాకుండా అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను త్వరగా వినియోగంలోకి తేవాలని యోచనలో ఉన్నారు.