మాట తప్పను మడమ తిప్పను
రైతులకు రుణ మాఫీ చేస్తా
హైదరాబాద్ – తాను ఇచ్చిన మాట తప్పే ప్రసక్తి లేదన్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి . ఆయన రైతులకు శుభ వార్త చెప్పారు. ఎన్నికల సందర్బంగా రుణ మాఫీ చేస్తామని చెప్పామని, దానిని తూచ తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
తాను మాట తప్పనని, మడమ తిప్పే ప్రసక్తి లేదన్నారు. ఇవాళ దేశంలో ఎక్కడా లేని రీతిలో తాము తెలంగాణలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సంస్థకు భారీ ఎత్తున భారం పడుతోందన్నారు. దానిని ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు.
ఇప్పటికే 80 శాతానికి పైగా రైతు బంధు కింద డబ్బులు జమ చేశామన్నారు. గత సర్కార్ ఖాళీ ఖజానా ఇచ్చిందని, దీని నుంచి గట్టెక్కేందుకు నానా తంటాలు పడుతున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి. ఆరు నూరైనా , అష్ట కష్టాలు పడైనా సరే తాను రుణ మాఫీ చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.