2018 నుండి 2023 వరకు వర్తింపు
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నం పెట్టే అన్నదాతలకు తీపి కబురు చెప్పింది. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
రాష్ట్రంలోని రైతులందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. రుణ మాఫీ చేస్తామని ఎన్నికల సందర్బంగా వరంగల్ వేదికగా జరిగిన సభలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రకటించిన విధంగా తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏక కాలంలో రుణాలు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. వ్యవసాయం దండగ అంటూ కొందరు చేసిన కామెంట్స్ ను ఆయన గుర్తు చేశారు. తాము పండుగ చేస్తామని అన్నారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, ఇవాళ తాను ఈ రుణ మాఫీ ప్రకటన చేయడం జీవితంలో మరిచి పోలేనని అన్నారు.
రుణ మాఫీకి సంబంధించి విధి విధానాలను ప్రకటిస్తామన్నారు. 12 డిసెంబర్ 2018 నుండి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని స్పష్టం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.