అపూర్వ ఆదరణ అనూహ్య స్పందన
సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
హైదరాబాద్ – విదేశీ పర్యటన ముగించుకుని విజయవంతంగా హైదరాబాద్ కు చేరుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. బుధవారం శంషాబాద్ విమానాశ్రయంకు రాగానే భారీ ఎత్తున సాదర స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు, అభిమానులు. కళాకారులు డప్పు చప్పుళ్లతో వెల్ కమ్ చెప్పగా భారీ కాన్వాయ్ సీఎం వెంట నడిచింది.
ఇదిలా ఉండగా 13 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియా దేశాలలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జనుంపల్లి అనిరుధ్ రెడ్డి , డెక్కన్ క్రానికల్ పత్రిక ఎడిటర్ శ్రీరామ్ కర్రి, ఐటీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ , తదితరులు ఉన్నారు.
రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన పది రోజుల పాటు దిగ్విజయంగా సాగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు సాదర స్వాగతం పలకడం విశేషం. ఈ పర్యటన తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రత్యక్షంగా, పరోక్షంగా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులే లక్ష్యంగా సాగింది.
50 కిపైగా రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. ఈ టూర్ లో నెట్ జీరో సిటీ, ఏఐ సిటీ, స్కిల్స్ యూనివర్శిటీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ వాటిపై వివరించారు సీఎం.
ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, డేటా సెంటర్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలకు చెందిన కంపెనీలతో పాటు ఫార్మా, లైఫ్ సైన్సెస్, కాస్మటిక్స్, టెక్స్టైల్, ఎలక్ట్రిక్ వాహన రంగాలకు చెందిన అనేక కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు.