NEWSTELANGANA

డిసెంబ‌ర్ 9న తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం ఏర్పాటు

Share it with your family & friends

ప్ర‌క‌టించిన రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ త‌ల్లి విగ్ర‌హంపై తీవ్ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్న ప్ర‌స్తుత సంద‌ర్బంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలన చేశారు.

సచివాలయం ఆవరణలో భవన ప్రధాన ద్వారం ముందు భాగం విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా భావించారు. డిసెంబర్ 9 న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి స్ప‌ష్టం చేశారు. ఆరు నూరైనా స‌రే ఏర్పాటు చేసి తీరుతామ‌ని ప్ర‌క‌టించారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర అధికార కేంద్రమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని, అక్కడ తెలంగాణ తల్లిని సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని గతంలోనే ప‌లు మార్లు చెప్పారు. అందులో భాగంగా సచివాలయ ఆవరణలో ఉన్న పరిస్థితిని ముఖ్యమంత్రి సలహాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డితో క‌లిసి ప‌రిశీలించారు.

అనంత‌రం విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలం, ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి అనుగుణమైన డిజైన్ కూర్పుపై అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు.