NEWSTELANGANA

సెమీ కండ‌క్ట‌ర్ కంపెనీల‌కు స్వాగ‌తం

Share it with your family & friends


భ‌విష్య‌త్తులో ఏఐటీ..స్కిల్స్ ..నెట్ జీరో సెంట‌ర్

అమెరికా – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భ‌విష్య‌త్తులో అన్ని రంగాల‌కు కేరాఫ్ గా హైద‌రాబాద్ మార బోతోంద‌ని స్ప‌ష్టం చేశారు.

హైదరాబాద్ నగర స్వరూప స్వభావాలను మార్చ బోయే ఏఐ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం “ది ఫ్యూచర్ స్టేట్” కు పర్యాయ పదంగా మారుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇలాంటి సందర్భంలో సెమి కండక్టర్ కంపెనీల ఏర్పాటుకు సంబంధించి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని అన్నారు.

అమెరికా టూర్ లో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కో లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ , యూఎస్ – ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‌ ఫోరం సంయుక్తంగా ఏర్పాటు చేసిన సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

ఇప్పటి వరకు తాము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించామ‌ని, ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాం. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. అవుటాఫ్ మెనీ.. వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం. టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారు.

కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉంది. దేశంలో రాష్టాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవు. ఇకనుంచి తెలంగాణ రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్‌గా పెట్టుకుందామ‌న్నారు..

ఈ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాల‌ని మీ అందరినీ తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.