కుల వృత్తిదారులకు సర్కార్ సాయం
ప్రకటించిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – కుల వృత్తులపై ఆధారపడి జీవించే అన్ని వర్గాలకు ప్రజా ప్రభుత్వం కావలసిన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో కుల వృత్తిదారుల పిల్లలు ఉన్న చోటే ఆగి పోకుండా ఉన్నత స్థానాలకు ఎదగాలని సీఎం ఆకాంక్షించారు.
చెట్టు ఎక్కినప్పుడు గీత వృత్తిదారులు ప్రమాదాలకు గురి కాకూడదనే సదుద్దేశంతో రూపొందించిన ‘కాటమయ్య రక్షణ కవచం’ పంపిణీని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్ గూడ గ్రామం తాటివనంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆ కవచం ధరించి చెట్లు ఎక్కిన గీత కార్మికులతో స్వయంగా మాట్లాడారు.
ఈ సందర్బంగా చెట్లు పెంచాలన్న గౌడన్నల విన్నపం మేరకు కొత్తగా నిర్మించ బోయే రహదారుల వెంబడి, వెలిసే రియల్ ఎస్టేట్ వెంచర్లలో తప్పనిసరిగా తాటిచెట్లు ,ఈత చెట్లు నాటాలనే నిబంధన తీసుకొస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. గీత వృత్తిదారులకు మోపెడ్ వాహనాలు అందించే అవకాశాలను కూడా పరిశీలిస్తామన్నారు.
తాళ్లు ఎక్కుతూ ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ. 7.90 కోట్ల ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి.
గీతకారులు తాటి చెట్ల మీద నుంచి కింద పడకుండా తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్ వంటి ఆరు పరికరాలతో కూడిన కిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కిట్లు రూపొందించిన పర్వతాహకురాలు మలావత్ పూర్ణ బృందాన్ని అభినందించారు.
రీజనల్ రింగ్ రోడ్డు వల్ల రంగారెడ్డి జిల్లాలోని రైతులకు మహర్దశ ఖాయమని, అందులో గౌడన్నలు కూడా ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు.