నల్లమల్ల బిడ్డను కల్వకుర్తిని మరువను
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కామెంట్
నాగర్ కర్నూల్ జిల్లా – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా వెల్దండ మండల కేంద్రంలోని సెంటర్ లో భారీ ఎత్తున ఏర్పాటు చేశారు దివంగత కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి విగ్రహాన్ని. సీఎం ఇవాళ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రేవంత్ రెడ్డి తాను పుట్టిన కల్వకుర్తి గడ్డను మరిచి పోనని అన్నారు. మీ రుణం తీర్చుకునే సమయం వచ్చిందన్నారు.
ఈ నేల ఎందరినో లీడర్లను ఇచ్చిందన్నారు. వారిలో ద్యాప గోపాల్ రెడ్డి, ఎడ్మ కిష్టా రెడ్డి, జైపాల్ రెడ్డి, పుట్టపాగ మహేంద్ర నాథ్ , భట్టు రుక్మారెడ్డి లాంటి మహామహులు ఇక్కడి వారేనని గుర్తు చేశారు. తాను జైపాల్ రెడ్డి గురించి మాట్లాడాలంటే చాలా పరిణతి చెంది ఉండాలన్నారు.
రాజకీయాలలో విలువలు నేర్పిన మహా నాయకుడు జైపాల్ రెడ్డి అంటూ కొనియాడారు. ఇదే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు గనుక సూదినిని సీఎం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించి ఉంటే ఎప్పుడో పవర్ లోకి వచ్చేవాళ్లమని అన్నారు రేవంత్ రెడ్డి.
ఇదే సమయంలో ప్రస్తుతం లక్షన్నర రైతుల ఖాతాల్లో వేశామని, త్వరలోనే రూ. 2 లక్షలు వేస్తామని ప్రకటించారు. కల్వకుర్తి నియోజకవర్గానికి భారీ ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం.