ఎస్సీ వర్గీకరణపై సీఎం కామెంట్స్
60 రోజులలో నివేదిక సమర్పించాలి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణపై చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో ఎస్సీ వర్గీకరణపై ఇటీవలే సంచలన తీర్పు వెలువరించింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు.
ఈ తరుణంలో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. బుధవారం రాష్ట్ర సర్కార్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా సీఎం చేసిన సూచనలను తెలియ చేసింది .
ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే కమిటీ సమావేశమైంది. ఇందులో మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దాసరి సీతక్క ఉన్నారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు.
అయితే సబ్ కమిటీ సూచనల మేరకు ముందుకు వెళ్లాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతే కాకుండా ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని స్పష్టం చేశారు . మరో వైపు రాష్ట్ర ముఖ్యమంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.
రేవంత్ రెడ్డి కావాలని మాలలకు సపోర్ట్ చేస్తూ మాదిగలకు అవకాశాలు రాకుండా చేస్తున్నాడని మండిపడ్డారు. తాడోపేడో తేల్చుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ఈ తరుణంలో సీఎం కీలక ప్రకటన చేయడం విశేషం.