NEWSTELANGANA

ఆరు గ్యారంటీలపై అపోహలు వద్దు

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కామెంట్

హైద‌రాబాద్ – ఆరు గ్యారెంటీల‌పై అపోహ‌లు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్ర‌సంగించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించారని కొనియాడారు. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత సింగరేణి కార్మికులు నిర్లక్ష్యానికి గురయ్యారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయడాన్ని బీఆర్ఎస్ అడ్డు కోకపోగా ప్రోత్సహించింద‌ని ఆరోపించారు సీఎం.

గత పాలకులు సృష్టించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామ‌ని చెప్పారు. రాష్ట్రంలో పేదలకు ఉపయోగపడే పనులు చేస్తూ ముందుకెళుతున్నామ‌ని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఏడాదికి రూ.6వేల కోట్లు అప్పులు చెల్లించేదని, కానీ ప‌దేళ్ల‌లో ఏడాదికి రూ. 70 వేల కోట్లు క‌ట్టాల్సిన దుస్థితికి తీసుకు వ‌చ్చారంటూ ధ్వ‌జ‌మెత్తారు రేవంత్ రెడ్డి.

రాష్ట్రాన్ని దివాళా తీయించార‌ని, ఇంత‌టి ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ప్ర‌తి నెలా మొదటి రోజే ఉద్యోగుల‌కు వేత‌నాలు చెల్లిస్తున్నామ‌ని చెప్పారు. మార్చి 31 లోపు రైతు బంధు ఇస్తామ‌ని మ‌రోసారి హామీ ఇస్తున్నాన‌ని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హ‌రీశ్ , క‌విత అబ‌ద్దాలు చెబుతూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు .