ఇప్పటికి 32 సార్లు రేవంత్ హస్తిన బాట
హైదరాబాద్ – సీఎంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడంతోనే సరిపోతోంది. పార్టీ హైకమాండ్ తక్షణమే రావాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆయన హుటా హుటిన హస్తినకు బయలుదేరి వెళ్లారు. ఊహించని విధంగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్న దీపాదాస్ మున్షీపై వేటు వేశారు. రాహుల్ గాంధీ టీంలో ఒకరైన మీనాక్షి నటరాజన్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 32 సార్లు ఢిల్లీకి వెళ్లారు రేవంత్ రెడ్డి.
మరో వైపు బిగ్ షాక్ ఇచ్చింది హైకమాండ్. కీలకమైన ఇన్ ఛార్జ్ పదవి నుంచి దీపా దాస్ మున్షీని తప్పించడం పట్ల పార్టీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఆమెపై పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, మంత్రులు కొందరు అధిష్టానంతో ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. దీంతో గత్యంతరం లేక తనను పక్కకు తప్పించారు.
మరో వైపు ఇటు రాష్ట్రంలో అటు హస్తినలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడపై కూడా సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగతోంది. తనకు ఇప్పటి వరకు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వక పోవడం కూడా ఈ అనుమానాలను నిజం చేస్తోంది. ఏది ఏమైనా ఇప్పట్లో తనను మార్చక పోవచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.