మోదీకి రేవంత్ సమస్యల చిట్టా
పరిష్కరించాలని సీఎం విన్నపం
హైదరాబాద్ – రెండు రోజుల తెలంగాణ పర్యటన ముగిసింది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీది. ఈ సందర్బంగా ఘనంగా వీడ్కోలు పలికారు సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళి సై. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న సమస్యలను పరిష్కరించేందుకు సాయం చేయాలని సీఎం పీఎంను కోరారు. సుదీర్ఘమైన లేఖ అందజేశారు మోదీకి. ఆయన సానుకూలంగా స్పందించారు.
పీఎంకు సమర్పించిన వినతులు ఇలా ఉన్నాయి. ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించిందని తెలిపారు.. మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు ఇస్తామని తెలిపారు సీఎం.
హైదరాబాద్ మెట్రో విస్తరణ అభివృద్ధికి, మూసీ ప్రక్షాళన రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేంందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని విన్నవించారు రేవంత్ రెడ్డి.
హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. 2022–23లోనే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీకి రూ,3 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు.
రూ.7700 కోట్ల అంచనా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును వెంటనే మంజూరు చేయాలని సీఎం కోరారు. ఈ కారిడార్ తో అటు శ్రీశైలం వెళ్లే యాత్రికులతో పాటు హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లా వరకు 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని తెలిపారు. దక్షిణ తెలంగాణ వైపు రవాణ మార్గాలు విస్తరిస్తాయని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఇంటింటికీ నల్లా నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల జీవన్ మిషన్ నిధులు కేటాయించాలని కోరారు సీఎం.
తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్య , పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్ రివ్యూ చేయాలని సూచించారు. అత్యవసరంగా 29 పోస్టులను అదనంగా కేటాయించాల్సి ఉందన్నారు. ఐపీఎస్ క్యాడర్ రివ్యూను అత్యవసర అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు.
హైదరాబాద్– రామగుండం, హైదరాబాద్–నాగ్పూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.
వీటితో పాటు కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1350 ఎకరాల మిలిటరీ డెయిరీ ఫామ్ ల్యాండ్స్ (తోఫెఖానా) రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. లీజు గడువు ముగిసిన శామీర్ పేటలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ (1038 ఎకరాల) భూములను తిరిగి అప్పగించాలని సూచించారు సీఎం.
ఐఐటీ, నల్సార్, సెంట్రల్ యూనివర్సిటీ తో పాటు ఎన్నో పేరొందిన పరిశోధన, ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయని తెలిపారు. అత్యున్నత విద్యా సంస్థలు అందరికీ అందుబాటులో ఉండాలని ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం నెలకొల్పాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందని, అందులో భాగంగా హైదరాబాద్లో ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) నెలకొల్పాలని కోరారు.
నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు పీఎంకు. 5259 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం నిర్వహిస్త్తోందన్నారు 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వాటాగా రాష్ట్రానికి రావాల్సిన రూ.347.54 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు.
కల్వకుర్తి–కొల్లాపూర్, గౌరెల్లి–వలిగొండ, తొర్రూర్–నెహ్రూనగర్, నెహ్రూనగర్–కొత్తగూడెం, జగిత్యాల–కరీంగర్ ఫోర్ లేన్, జడ్చర్ల–మరికల్ ఫోర్ లేన్, మరికల్–సాగర్ నిలిచి పోయిన టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులు ఇవ్వాలన్నారు.
తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకారాన్ని కోరుతున్నామని తెలిపారు.