కిషన్ రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ
నిధులు మంజూరుకు ఓకే చెప్పండి
ఢిల్లీ – ఢిల్లీ టూర్ లో భాగంగా కేంద్ర మంత్రులను కలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులకు ఆమోదం తెలపాలని, నిధులు మంజూరుకు సహకరించాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి విన్నవించారు. కేంద్రం సహాయ సహకారాలు అందజేసేలా తాను ప్రయత్నం చేస్తానని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి.
అంతకు ముందు రేవంత్ రెడ్డి నితిన్ గడ్కరీతో ములాఖత్ అయ్యారు. గిరిజన ప్రాంతాల్లో గోదావరి, కృష్ణా నదులపై కనెక్టివిటీని మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రీజినల్ రింగ్ రోడ్ (RRR) ఉత్తర విభాగానికి సాంకేతిక, ఆర్థిక అనుమతులు మంజూరు చేయాలని అభ్యర్థించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణలో 94 శాతం పూర్తి చేసిందని తెలిపారు సీఎం.
హైదరాబాద్, శ్రీశైలాన్ని కలిపేలా అమ్రాబాద్ అడవుల్లో నాలుగు లైన్‌ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని , భద్రతను మెరుగు పరచడానికి, ప్రమాదాలను తగ్గించడానికి హైదరాబాద్, విజయవాడ (ఎన్ హెచ్ -65)ను ఆరు లేన్లుగా విస్తరించేందుకు సమర్పించిన డీపీఆర్ ను ఆమోదించాలని రేవంత్ రెడ్డి కోరారు.
NH-63 ట్రాఫిక్‌ను నగరం నుండి దూరంగా మళ్లించడానికి వరంగల్ , హన్మకొండలను కలుపుతూ బైపాస్ కోసం అనుమతి ఇవ్వాలని అన్నారు. నల్గొండ జిల్లాలో ఎన్‌హెచ్-65 వెంబడి 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో రవాణా శిక్షణా సంస్థను ఏర్పాటు చేయాలని విన్నవించారు.